Andhra Pradesh: నేడు, రేపు టీడీపీ మాక్ అసెంబ్లీ.. మంత్రులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TDP Conduct Mock Assembly today and tomorrow

  • స్పీకర్‌గా కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి
  • నేటి సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు
  • రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  • నేడు కొవిడ్‌పై స్వల్పకాలిక చర్చ

తెలుగుదేశం పార్టీ నేడు, రేపు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రులుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ్యవహరించనుండగా, స్పీకర్‌గా కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యవహరించనున్నారు. నేటి సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాక్ అసెంబ్లీ జరగనుంది.

ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్ శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రిగా వ్యవహరించనుండగా, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా దువ్వారపు రామారావు, పౌరసరఫరాల మంత్రిగా వైవీబీ రాజేంద్రప్రసాద్, జలవనరుల శాఖ మంత్రిగా బుద్ధా వెంకన్న, దేవాదాయ శాఖకు బుద్ధా నాగజగదీశ్, ఎమ్మెల్యేలు  అనగాని సత్యప్రసాద్ వ్యవసాయం, గద్దే రామ్మోహన్ హోంశాఖ మంత్రులుగా వ్యవహరిస్తారు. జీరో అవర్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యవహరిస్తారు.

మొదటి రోజు కరోనాపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనుండగా, ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగులు ప్రదర్శిస్తామని టీడీపీ తెలిపింది. దీనిపై దువ్వారపు రామారావు సమాధానం తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష నేత ప్రసంగిస్తారు. రెండోరోజైన రేపు ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, దిశ బిల్లు పేరుతో మోసం, పింఛను పెంపులో మోసం, ధరల పెరుగుదల, కార్పొరేషన్ల పేరుతో మోసం వంటి అంశాలను ప్రస్తావించనున్నట్టు టీడీపీ తెలిపింది.

  • Loading...

More Telugu News