Jagan: హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలు మన రాష్ట్రానికి లేవు: సీఎం జగన్
- కొవిడ్ పరిస్థితులపై అసెంబ్లీలో సీఎం వివరణ
- గతేడాది మార్చిలో ఏపీలో తొలి కేసు వచ్చిందన్న సీఎం జగన్
- కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు పూణే పంపామని వెల్లడి
- ఇప్పుడు రాష్ట్రంలో 150 కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నట్టు వివరణ
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని భావిస్తున్న తరుణంలో ప్రపంచానికి కొవిడ్ ఓ సవాలుగా పరిణమించిందని అన్నారు. 2020 మార్చిలో ఏపీలో తొలి కరోనా కేసు నమోదైందని, ఆ సమయంలో కరోనా నిర్ధారణ కోసం ఆ శాంపిల్ ను పూణే పంపించాల్సి వచ్చిందని సీఎం జగన్ వెల్లడించారు. ఆ సమయంలో కనీసం కరోనా టెస్టులు కూడా చేయించలేని స్థితిలో మన రాష్ట్రం ఉందని తెలిపారు.
"ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ అధీనంలో 150కి పైగా ల్యాబ్ లు కరోనా పరీక్షలు చేస్తున్నాయి. రోజుకు లక్షకు పైగా టెస్టులు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ తొలి వేవ్ సమయంలో 261 ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తే, ఇప్పుడు సెకండ్ వేవ్ నాటికి కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్య 649 కంటే ఎక్కువగా ఉంది.
రాష్ట్ర విభజన నాటికి మనకు పెద్ద నగరం ఒక్కటీ లేదు. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల స్థాయిలో ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఆసుపత్రులు కలిగిన నగరాలు లేవు. రాష్ట్ర విభజన కారణంగా ప్రధాన నగరం అటువైపు వెళ్లిపోవడంతో నాణ్యమైన వైద్యసేవలకు కొరత ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో వైద్య రంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాం. జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకునేలా మన ఆసుపత్రులను మలిచేందుకు నాడు-నేడు కార్యాచరణ తీసుకువచ్చాం" అని వివరించారు.