Jagan: వ్యాక్సిన్లపై వీళ్లకు అన్నీ తెలుసు అధ్యక్షా... కానీ వక్రీకరిస్తున్నారు!: సీఎం జగన్
- రామోజీరావు, చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు
- అసత్యాలతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజం
- వ్యాక్సిన్ గణాంకాలు అసెంబ్లీలో వివరించిన ఏపీ సీఎం
- గ్లోబల్ టెండర్లకు వెళ్లామని వెల్లడి
- ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ముగింపు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష తెలుగుదేశం పార్టీపైనా, కొన్ని మీడియా సంస్థలపైనా విమర్శలు చేశారు. ఈ 14 నెలల్లో కరోనాపై రూ.2,229 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు శక్తిమేర కృషి చేస్తున్నామని చెప్పారు.
"ఇవాళ్టి అసెంబ్లీ ద్వారా వ్యాక్సినేషన్ కు సంబంధించిన కొన్ని విషయాలను ప్రజలకు చెప్పదలచుకున్నాను. వ్యాక్సిన్ అంశంపై కొందరు పదేపదే వక్రీకరిస్తున్నారు. తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో 45 ఏళ్లకు పైబడినవారు 26 కోట్ల మంది ఉన్నారు. ఆ 26 కోట్ల మందికి రెండు డోసులు అంటే 52 కోట్ల డోసులు వాళ్ల కోసమే కావాలి. ఇక 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకు రెండు డోసులు ఇవ్వాలంటే 120 కోట్ల డోసులు కావాలి అధ్యక్షా.
ఓవరాల్ గా 172 కోట్ల డోసులు మనకు అవసరం అయితే, మనదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు కేవలం 7 కోట్ల డోసులే. వీటిలో 6 కోట్ల డోసులు సీరమ్ సంస్థ, 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్నాయి. దేశానికి 172 కోట్ల డోసులు అవసరమైతే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరిగింది 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమే.
ఇక మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 45 ఏళ్లకు పైబడినవాళ్ల సంఖ్య 1.48 కోట్లు. వాళ్లందరికీ రెండు డోసులు అంటే 3 కోట్ల డోసులు కావాలి. 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ 4 కోట్ల డోసులు కావాలి. మొత్తమ్మీద రాష్ట్రానికి 7 కోట్ల డోసులు ఇవ్వాలి. కానీ కేంద్రం మనకు ఇచ్చింది 76 లక్షల 29 వేల 580 డోసులు మాత్రమే.
వాస్తవాలు ఇలావుంటే... కొందరు రాజకీయాలు చేస్తున్నారు. వారందరికీ ఈ వాస్తవాలు తెలుసు అధ్యక్షా. ఆరోపణలు చేసేవారందరికీ ఈ పరిస్థితులు తెలుసు. ఈ ఆరోపణలనే ఈనాడులో రామోజీరావు గారు రాస్తుంటారు. ఇదే రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే ఈ భారత్ బయోటెక్. చంద్రబాబునాయుడికీ బంధువులు. మరి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వాళ్లకు తెలుసు కదా అధ్యక్షా.
తెలిసి కూడా... వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు? డబ్బులు పెట్టి వ్యాక్సిన్లు ఎందుకు కొనడంలేదు? కమీషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడంలేదని అంటున్నారు. కొవిడ్ సమయంలో ఈ దుర్మార్గపు ఆరోపణలు, వక్రీకరణలు చూస్తుంటే మనసుకు బాధ కలుగుతుంది అధ్యక్షా.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న తక్షణ ప్రాధాన్యత వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లడమే. గ్లోబల్ టెండర్లకు వెళ్లిన అతి తక్కువ రాష్ట్రాల్లో ఏపీ పైవరుసలో ఉంటుంది. దేవుడి దయతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. అది కూడా ఉచితంగానే. వ్యాక్సినేషన్ ను 50 శాతానికన్నా తీసుకెళితేనే సామూహిక వ్యాధినిరోధకశక్తి ఏర్పడుతుంది. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ వరకు మాస్కులు, భౌతికదూరం ఎలాగూ తప్పవు" అని వివరించారు.