Jagan: ఆనందయ్య ఆయుర్వేద మందుపై నిర్ధారణకు నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం: సీఎం జగన్
- నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందుపై ప్రజల్లో నమ్మకం
- నిత్యం వేలమందికి ఔషధ వితరణ
- సమీక్షలో చర్చించిన సీఎం జగన్
- శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని నిర్ణయం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇచ్చే ఆయుర్వేద మందు కరోనాను పారదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్మడమే కాదు, ఆ మందు కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా నిత్యం వేలమంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులుతీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనిపై సీఎం జగన్ తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. అయితే, ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకోసం నెల్లూరుకు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.