Nara Lokesh: అసెంబ్లీలో ఈ తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా?: చంద్రబాబు
- ఉక్కు పరిశ్రమ నుంచి అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా
- కరోనా రోగులకు ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు
- ఉక్కు పరిశ్రమపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ
- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న చంద్రబాబు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం 100వ రోజుకి చేరిన నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు.
'కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసింది విశాఖ ఉక్కు కర్మాగారం. వెయ్యి పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోంది. అటువంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా?' అని చంద్రబాబు నిలదీశారు.
'32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటై, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంది' అని చంద్రబాబు చెప్పారు.
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైఎస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు' అని నారా లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
'ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది' అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.