Hyderabad: బండెనుక బండి.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నిలిచిపోయిన వాహనాలు.. వీడియో ఇదిగో
- లాక్డౌన్లోనూ భారీగా బయటకు వాహనాలు
- పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు
- పలు వాహనాలు సీజ్
- దిల్సుఖ్నగర్, ఎర్రగడ్డ, బేగంపేటలో పరిస్థితి దారుణం
తెలంగాణలో లాక్ డౌన్ ను పటిష్ఠంగా అమలు చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కూడా హెచ్చరించినప్పటికీ ఈ రోజు హైదరాబాద్లోని రోడ్లపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
బాధ్యతారాహిత్యంతో చాలామంది వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. కొందరు నకిలీ పత్రాలను పట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా బయటకు వచ్చిన పలు వాహనాలను సీజ్ చేశారు. దిల్సుఖ్నగర్లో రోడ్లపైకి భారీగా వాహనాలు రావడంతో వాటన్నింటినీ తనిఖీ చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వస్తోంది.
వాహనాలన్నింటినీ తనిఖీ చేస్తుండడంతో ఒకదాని వెనుక ఒకటి భారీగా నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. మరోవైపు, ఎర్రగడ్డలోనూ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తుండడంతో రైతు బజార్ నుంచి మూసాపేట వంతెన వరకు వాహనాలు నిలిచిపోయాయి.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గోషామహల్, పంజాగుట్ట ప్రాంతాల్లోనూ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.