Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్
- హై రిస్క్ కేటగిరీలో ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పాత్రికేయ రంగాలవారు
- రాష్ట్రంలో ప్రస్తుతం 13.13 లక్షల టీకా డోసులు
- 18-45 ఏళ్ల మధ్య వారికి ప్రస్తుతానికి టీకా లేనట్టే
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్టులు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, పాత్రికేయులను హైరిస్క్ కేటగిరీగా గుర్తించామన్నారు. వీరందరికీ టీకాలు వేయనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 13.13 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. వీటిలో 1.55 లక్షల కొవాగ్జిన్ టీకాలను రెండో డోసు కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే, 11.58 లక్షల కొవిషీల్డ్ టీకాలను తొలి డోసుగా ఇస్తామన్నారు. ప్రస్తుతానికైతే 18-45 లోపు వారికి టీకాలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పిన సింఘాల్.. ఆసుపత్రుల్లో పడకల ఖాళీలు పెరిగినట్టు వివరించారు. నిన్నటికి రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయూ పడకలు, 2,867 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు.