Kamal Nath: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పై కేసు నమోదు
- ప్రపంచంలో వ్యాపిస్తున్న వైరస్ ఇండియన్ వేరియంట్ అని కమల్ నాథ్ వ్యాఖ్య
- ప్రజల్లో కరోనా భయాలు పెంచారంటూ ఎఫ్ఐఆర్ నమోదు
- దేశ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని ఆరోపణ
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు భయపడేలా కామెంట్లు చేశారంటూ బీజేపీ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. భోపాల్ లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఉజ్జయినిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇండియన్ వేరియంట్ అని కమల్ నాథ్ అన్నారు.
దీంతో ఆయనపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 188, సెక్షన్ 54 కింద కేసు నమోదు చేశారు. కమల్ నాథ్ వ్యాఖ్యలు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల్లో అయోమయాన్ని పెంచేలా ఉన్నాయని, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.