Etela Rajender: బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ!

Etal Rajender Ready to join in bjp

  • నేడే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం
  • ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ కూడా
  • నడ్డాతో అపాయింట్‌మెంట్ ఖరారు
  • భేటీ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మూడు రోజుల్లోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఆయన నేడే ఢిల్లీ వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకనే నేటి విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. ఈటలతోపాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారని సమాచారం.

బీజేపీ కీలక నేతలతో గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న ఈటల నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్‌, తెలంగాణ చీఫ్ బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆరెస్సెస్ కీలక నేతలతోనూ ఈటల సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన తర్వాత ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

నిజానికి రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. అయితే, కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడం, బీజేపీ నుంచి ఆహ్వానం రావడంతో ఈటల మనసు మార్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అపాయింట్‌మెంట్ ఖరారైందని, ఆయన ఢిల్లీ వెళ్లి చర్చిస్తారని, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News