Junior NTR: తొలి పారితోషికాన్ని తల్లిచేతిలో పెట్టిన ఎన్టీఆర్!
- 'నిన్ను చూడాలని'తో హీరోగా పరిచయం
- తొలి పారితోషికం 4 లక్షలు
- హీరోగా 20 ఏళ్ల ప్రయాణం
- మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్
ఎన్టీఆర్ టీనేజ్ లోనే 'నిన్ను చూడాలని' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. హీరోగా తన తొలి సినిమాను ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై చేశాడు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. నటన పరంగా ఎన్టీఆర్ కి పాస్ మార్కులు పడిపోయినా, కథాకథనాల పరంగా ఈ సినిమా అంతగా ఆడలేదు. అయినా ఫస్టు సినిమా కావడం వలన, ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎన్టీఆర్ తరచూ గుర్తుచేసుకుంటూనే ఉంటాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడనే ఆసక్తి ఆయన అభిమానులకు తప్పకుండా ఉంటుంది.
తాజాగా ఆ విషయం బయటికి వచ్చింది. తొలి సినిమాకి ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం అక్షరాలా 4 లక్షలట. ఆ పారితోషికం చేతికి అందినప్పుడు ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఆ పారితోషికాన్ని తీసుకెళ్లి తల్లి చేతిలో పెట్టి ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. అయితే తరచూ ఆ డబ్బు తీసుకుని లెక్కపెట్టేసి తిరిగి తల్లికి ఇచ్చేస్తూ ఉండేవాడట. అలాంటి ఎన్టీఆర్ తన కెరియర్ ను మొదలుపెట్టేసి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన పారితోషికం కోట్లలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా?