Gagandeep Kang: ధనిక దేశాలన్నీ తమ ప్రజలకు టీకాలు వేసే వరకు భారత్ వేచి చూడక తప్పదు: ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్
- డిసెంబరు నాటికి 200 కోట్ల డోసులు సమకూర్చుకోవడం అసాధ్యం
- భారత్ కూడా ముందే మేలుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు
- టీకాలు ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థలు అద్భుతమైనవే
- సామర్థ్యం పెంపే అసలు సమస్య
ధనిక దేశాలన్నీ తమ పౌరులకు టీకాలు ఇచ్చేంత వరకు భారత్‌కు ఎదురుచూపులు తప్పకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. ధనిక దేశాలన్నీ ఇప్పటికే టీకాలను పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నాయని, ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితే తప్ప భారత్ లాంటి దేశాలకు టీకాలు అందుబాటులోకి రావన్నారు. ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో టీకాల సరఫరా పరిస్థితి మెరుగుపడుతుందని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.
ఈ ఏడాది డిసెంబరు నాటికి 200 కోట్ల డోసులను సమకూర్చుకుంటామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్ స్పందిస్తూ.. అలా జరిగే అవకాశమే లేదన్నారు. ఏడాది చివరినాటికి 200 కోట్ల డోసులను సమకూర్చుకోవడం దాదాపు అసాధ్యమని, కాకపోతే, అది సాకారం కావాలనే తాను కోరుకుంటానని కాంగ్ చెప్పుకొచ్చారు.
భారత్‌లో టీకాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు రెండూ అద్భుతమైనవేనని, టీకాల ఉత్పత్తి సామర్థ్యం వాటికి ఉందని అన్నారు. అయితే, ఉత్పత్తి సామర్థ్యం పెంచడమే ప్రధాన సమస్య అని కాంగ్ వివరించారు. టీకాలు అభివృద్ధి దశలో ఉన్నప్పుడే అనేక దేశాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయని, భారత్ మాత్రం వాటిని కొనుగోలు చేసే రిస్క్ చేయలేకపోయిందన్నారు.
భారత్ కూడా గతేడాదే వ్యాక్సిన్లను భారీ స్థాయిలో కొనుగోలు చేసి ఉంటే దేశంలో ఇప్పుడీ పరిస్థితులు ఉండేవి కావని, వ్యాక్సినేషన్‌లో ఇబ్బందులు తలెత్తి ఉండేవి కావని అన్నారు. టీకాలు ప్రయోగ దశలో ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసేందుకు రిస్క్ చేయలేకపోయిందని కాంగ్ అభిప్రాయపడ్డారు.