E. Peddi Reddy: ఈటల విషయంలో బీజేపీ తొందరపడుతోంది.. సిద్ధాంతాలను మూలనపడేస్తోంది: బీజేపీ నేత పెద్దిరెడ్డి

E Peddi Reddy Disappointed over Etela Issue

  • ఈటల విషయంలో ఇంత హడావుడి ఎందుకో అర్థం కావడం లేదు
  • ప్రత్యేక విమానంలో వచ్చి ప్రైవేటు రిసార్టులో రహస్య సమావేశాలా?
  • స్థానిక నేతనైన నన్ను ఒక్కరు కూడా సంప్రదించలేదు
  • పెద్దిరెడ్డి ఆవేదన

తెలంగాణ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ విషయంలో బీజేపీ తొందరపడుతోందని ఆ పార్టీ తెలంగాణ కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈటల విషయంలో పార్టీ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైద్ధాంతిక పునాదులపై నిర్మితమైన పార్టీ ఇప్పుడు వాటికే తిలోదకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ అయిన ఈటలను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.

ఈటల ఇంకా టీఆర్ఎస్‌లోనే ఉన్నారని, ఆయనపై వచ్చిన ఆరోపణలు తేలే వరకు కాస్త సహనంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఓ నేత ప్రైవేటు రిసార్టులో సమావేశం పెట్టారని తనకు తెలిసిందన్నారు. ఇంత రహస్యంగా సమావేశం ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు.

ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వస్తానంటే అప్పుడు ఆలోచించాలని అన్నారు. తాను హుజూరాబాద్ స్థానిక నేతనని, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని గుర్తు చేసిన పెద్దిరెడ్డి.. స్థానిక నేతను అయిన తనతో ఈటల విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News