Narendra Modi: ప్రధాని అరగంట సేపు మీ కోసం వేచిచూడాలా... అంత అహంకారమా?: మమతా బెనర్జీపై కేంద్రం ఆగ్రహం
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే
- ప్రధానిని మమత అసహనానికి గురిచేశారన్న కేంద్రం
- ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని ఆరోపణ
- షెడ్యూల్ ప్రకారమే వచ్చామన్న మమత
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్ లో యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ప్రధానికి అసహనం కలిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కలైకుంద ఎయిర్ బేస్ వద్ద మమతా బెనర్జీ కోసం ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధంకర్ దాదాపు 30 నిమిషాల సేపు వేచి చూడాల్సి వచ్చిందని వెల్లడించాయి. తుపాను సమీక్ష కోసం ప్రధాని వస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని ఆరోపించాయి.
దేశ చరిత్రలో ఇంత నీచంగా ప్రవర్తించిన సీఎం మరొకరు లేరని కేంద్రం వర్గాలు మండిపడ్డాయి. ఈ ముఖ్యమంత్రికి ఇంగితజ్ఞానం లేదు, అహంకారి అంటూ విమర్శించాయి. అయితే, దీనిపై మమత వాదన మరోలా ఉంది. వాస్తవానికి ప్రధానిని తాము ధిఘా వద్ద కలుస్తామని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. అయితే, ప్రధానిని కలైకుంద ఎయిర్ బేస్ వద్ద కలవాలని కేంద్ర ప్రభుత్వం మమతకు సూచించింది. దాంతో మమత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
కాగా, దీనిపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. మమతకు బద్ధ విరోధి అయిన సువేందు అధికారి ప్రధాని పక్కనే ఉండడంతో మమత తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది.
దీనిపై బెంగాల్ ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. మమతా బెనర్జీకి అనేక కార్యక్రమాలు ఉండడంతో ఆమె ప్రధానితో భేటీకి కూడా కొంత సమయం కేటాయించారని, ముందు నిర్ణయించిన షెడ్యూల్ మేరకే అమె వచ్చారని, ఇక ప్రధానిని ఎందుకు వేచిచూసేలా చేస్తారంటూ ప్రశ్నించాయి.