Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!

Raghurama Raju complains Rajnath Singh on Army Hospital Registrar

  • ఈ మధ్యాహ్నం రాజ్ నాథ్ తో రఘురామ భేటీ
  • మూడు పేజీల లేఖ అందించిన రఘురామ
  • తన డిశ్చార్జికి వైద్యులపై కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపణ
  • తనను సీఐడీకి అప్పగించేందుకు కుట్ర పన్నారని వెల్లడి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలవడం ఆసక్తి కలిగించింది. రఘురామ కేంద్రమంత్రిని కలవడానికి గల కారణాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి. ఇటీవల తాను చికిత్స పొందిన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై రఘురామ రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేశారు. తనను ఆర్మీ ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేందుకు వైద్యులపై కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని రఘురామ ఆరోపించారు. ఈ మేరకు రాజ్ నాథ్ కు మూడు పేజీల లేఖను సమర్పించారు.

కేపీ రెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్ర పన్నారని లేఖలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మఫ్టీ పోలీసులు మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. ఈ క్రమంలో 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా రఘురామ తన లేఖకు జతచేసి రాజ్ నాథ్ కు అందజేశారు. రక్షణ శాఖ మంత్రిగా కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ ను కోరారు. రఘురామ విజ్ఞప్తిపై స్పందించిన రాజ్ నాథ్... విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News