BCCI: సీపీఎల్ ను ముందే ముగించండి... ఐపీఎల్ కోసం విండీస్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు!
- సెప్టెంబరులో యూఏఈ గడ్డపై ఐపీఎల్
- అదే సమయంలో ముగియనున్న సీపీఎల్
- విండీస్ ఆటగాళ్లు సకాలంలో చేరుకోలేరని భావిస్తున్న బీసీసీఐ
- షెడ్యూల్ మార్చుకోవాలని విండీస్ బోర్డును కోరుతున్న వైనం
ఐపీఎల్ 14వ సీజన్ కరోనా ప్రభావంతో అర్ధంతరంగా నిలిచిపోవడంతో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ సమాయత్తమవుతోంది. షెడ్యూల్ ప్రకటించకపోయినా సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఐపీఎల్ ను ముగించాలన్నది బీసీసీఐ ప్లాన్. అయితే, అదే సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) జరగనుంది.
ఆగస్టు 28న ప్రారంభమయ్యే సీపీఎల్ సెప్టెంబరు 19తో ముగియనుంది. ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనల కారణంగా చాలామంది విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశముంది. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ కు వస్తారో, రారో అన్న సందేహాలు ఉన్నాయి. కొత్తగా విండీస్ ఆటగాళ్లు కూడా దూరమైతే టోర్నీ కళ తప్పుతుంది.
ఈ నేపథ్యంలో, నష్టనివారణ కోసం బీసీసీఐ... విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలకు రంగంలోకి దిగింది. సీపీఎల్ ను ముందే ముగించేలా ఒప్పిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తద్వారా ఆటగాళ్లు ఐపీఎల్ కు సిద్ధమయ్యేందుకు తగిన సమయం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ బీసీసీఐ, విండీస్ క్రికెట్ బోర్డు మధ్య చర్చలు విఫలమైతే... విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ ల్లో కొన్నింటికి దూరమవుతారు.
ఐపీఎల్ కు విండీస్ ఆటగాళ్లు పెద్ద ఆస్తి అని చెప్పాలి. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, జాసన్ హోల్డర్, నికోలాస్ పూరన్ తదితరులు తమ ఆటతీరుతో టోర్నీకే వన్నె తెస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.