Karnataka: మృతదేహాన్ని ఇచ్చేందుకు రూ. 7.5 లక్షలు అడుగుతున్నారు.. ఆ కుటుంబాన్ని ఆదుకోండి ప్లీజ్: కేసీఆర్‌ను కోరిన కర్ణాటక కాంగ్రెస్ నేత శివకుమార్
- మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివకుమార్ బంధువు మృతి
- శివకుమార్ ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్
- మృతదేహాన్ని కర్ణాటకకు పంపే ఏర్పాట్లు
- కేసీఆర్, కేటీఆర్‌కు శివకుమార్ కృతజ్ఞతలు
కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సాయాన్ని అర్థించారు. తమ బంధువు భార్య శశికళామంజునాథన్ కరోనాతో హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారని, అక్కడ చికిత్స పొందుతూ మరణించారని శివకుమార్ తెలిపారు. మృతదేహాన్ని అప్పగించేందుకు రూ. 7.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని, కానీ వారి వద్ద రూ. 2 లక్షలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌లను ట్విట్టర్ ద్వారా కోరారు.
వెంటనే స్పందించిన కేటీఆర్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి శశికళ మృతదేహాన్ని కర్ణాటకకు పంపే ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన శివకుమార్ కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ విషయమై మెడికవర్ ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ.. శశికళను తీవ్ర విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేర్చారని తెలిపాయి. తాము కేవలం మందుల ఖర్చులు మాత్రమే తీసుకున్నామని ఆసుపత్రి ముఖ్య వైద్యుడొకరు తెలిపారు.