Mamata Banerjee: బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రిలీవ్ చేయం: స్పష్టం చేసిన మమతా బెనర్జీ
- ప్రధాన కార్యదర్శిని డిప్యుటేషన్‌పై పిలిపించిన కేంద్రం
- కేంద్ర సర్కారు ఆదేశాలు షాక్‌కు గురిచేశాయని వ్యాఖ్య
- ప్రస్తుత పరిస్థితుల్లో రిలీవ్ చేయలేమన్న మమత
కేంద్రప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి షాక్ ఇచ్చారు. కేంద్రం కోరినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్‌ను డిప్యుటేషన్‌పై వెనక్కి పంపించే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. ఆయనను కేంద్ర సర్వీసులకు పంపించేది లేదని ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు.
కేంద్ర సర్కారు ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశం తనను షాక్‌కు గురిచేసిందని మమత పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని రిలీవ్ చేయదని, గతంలో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చట్టపరమైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని తాము భావిస్తున్నట్లు తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే యోచనలోనూ ఉన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.