Juhi Chawla: భారత్ లో 5జీ సేవలను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాలీవుడ్ నటి జుహీ చావ్లా
- భారత్ లో రంగప్రవేశం చేస్తున్న 5జీ
- పర్యావరణం హానికరమన్న వాదనలు
- వ్యతిరేకించడానికి తగిన కారణమే ఉందన్న జుహీ
- నూతన ఆవిష్కరణలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
ఐదో తరం వైర్ లెస్ నెట్వర్క్ సేవలుగా ప్రచారం పొందుతున్న 5జీ భారత్ లోనూ రంగప్రవేశం చేస్తోంది. అధికవేగంతో కూడిన ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్ సేవలు 5జీతో సాధ్యమవుతాయి. అయితే, 5జీ కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్న వాదనలు కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ లో 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ప్రముఖ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జూహీ చావ్లా స్పందించారు.
"సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును మేం వ్యతిరేకించడంలేదు. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న నవ్య ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నాం. అయితే, తదుపరి తరం పరికరాల వినియోగంలోనే అసందిగ్దత ఏర్పడుతోంది. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నదానికి తగిన కారణం ఇదే. ప్రజల భద్రతకు ఇది హానికరం అని భావిస్తున్నాం" అంటూ తన నిర్ణయాన్ని ఆమె సమర్థించుకున్నారు. అయితే, కేంద్ర టెలింకా శాఖ మాత్రం ఈ తరహా వాదనలను అంగీకరించడంలేదు.