Telangana: తెలంగాణ‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటాం: వైద్య ఆరోగ్య శాఖ సంచాల‌కుడు

ready to face third wave

  • బ్లాక్ ఫంగ‌స్ చికిత్సకు సదుపాయాల పెంపు 
  • ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌ను పెంచుతున్నాం
  • నీలోఫ‌ర్ ఆసుప‌త్రిని నోడ‌ల్ కేంద్రంగా ఏర్పాటు చేశాం
  • మూడో ద‌శ గురించి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తామన్న శ్రీనివాసరావు 

దేశంలో క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఆక్సిజ‌న్, వైద్య ప‌రిక‌రాలు, ఔష‌ధాలు, ఆసుప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌తో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మూడో ద‌శ విజృంభ‌ణ‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టి నుంచే చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

ఈ ఏడాది ఆగ‌స్టులో లేదా న‌వంబ‌రులో క‌రోనా మూడో ద‌శ‌ విజృంభ‌ణ ఉంటుంద‌న్న అంచ‌నాల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను ముందుగానే కొంటామ‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు అన్నారు.

బ్లాక్ ఫంగ‌స్ చికిత్స సౌక‌ర్యాలను పెంచుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 744 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యాయ‌ని శ్రీనివాసరావు వివ‌రించారు. బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు ఔష‌ధాల కొర‌త దేశ వ్యాప్తంగా ఉంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌ను పెంచుతున్నామ‌ని వివ‌రించారు.

నీలోఫ‌ర్ ఆసుప‌త్రిని నోడ‌ల్ కేంద్రంగా ఏర్పాటు చేశామ‌ని శ్రీనివాసరావు చెప్పారు. మూడో ద‌శకు అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను ముందుగానే కొనుగోలు చేస్తున్నామ‌ని చెప్పారు. మూడో ద‌శ గురించి సిబ్బందికి శిక్ష‌ణ ఇస్తామ‌ని, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తామ‌ని వివ‌రించారు.  

రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచుతున్నామ‌ని ఆయన తెలిపారు. మే 29న రాష్ట్రంలో ల‌క్ష క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు. అలాగే, రెండో ద‌శ ఫీవ‌ర్ సర్వేలో 68.56 శాతం మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు.

ప్రైవేటు ఆసుప‌త్రుల్లో బిల్లులు, ఇత‌ర అంశాల‌పై వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని శ్రీనివాసరావు తెలిపారు. ఫిర్యాదుల ప‌రిశీల‌న‌కు ముగ్గురు ఐఏఎస్‌ల‌తో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టికే 79 ఆసుప‌త్రుల‌కు నోటీసులు జారీ చేశామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News