Delhi: ఢిల్లీలో జూన్ మాసంలో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
- నిన్న 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- భారీ వర్షం కారణంగానే అంటున్న ఐఎండీ
- వివరణ ఇచ్చిన ఐఎండీ చీఫ్
- 2006 జూన్ లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
దేశ రాజధాని ఢిల్లీ చలికి మాత్రమే కాదు అధిక ఉష్ణోగ్రతలకు కూడా ప్రసిద్ధి. అలాంటిది, జూన్ మాసంలో గతంలో ఎన్నడూలేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న ఢిల్లీలో 17.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గుర్తించారు. ఇది జూన్ ఆరంభంలో కనిపించే సాధారణ ఉష్ణోగ్రత కంటే 10 పాయింట్లు తక్కువ. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
దీనిపై ఐఎండీ చీఫ్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరణ ఇస్తూ, రాత్రంతా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందని, ఈ కారణంగానే మంగళవారం అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. కాగా, 2006 జూన్ 17న ఢిల్లీలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు ఇదే రికార్డు. అయితే, మంగళవారం 15.6 మిమీ వర్షపాతం నమోదు కావడంతో దేశ రాజధాని బాగా చల్లబడింది.