Bandi Sanjay: టీఆర్ఎస్ పై పోరాటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, ఉద్యమకారులు కలసి రావాలి: బండి సంజయ్ పిలుపు
- టీఆర్ఎస్ పార్టీని సమాధి చేస్తాం
- అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది
- రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన నడుస్తోందన్న సంజయ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీని సమాధి చేస్తామని అన్నారు.
టీఆర్ఎస్ పై పోరాటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, ఉద్యమకారులు తమతో కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ, దివంగత సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖత్వ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం, ఎంఐఎం కోసమే తెచ్చుకున్నారన్న చర్చ మేధావుల్లో జరుగుతోందని ఆయన చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ ఏయే హామీలు ఇచ్చారో ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుకుకుంటానని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్నారని, ఆయన ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని సంజయ్ నిలదీశారు.