CPI Narayana: కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు: సీపీఐ నారాయణ
- తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఆయన అకౌంట్లో వేసుకున్నారు
- తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ పెద్దపీట వేశారు
- హైదరాబాదులో బీజేపీ బలపడటానికి కూడా కేసీఆరే కారణం
ఎందరో ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు పూర్తవుతోందని... ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టు పట్టించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లోనే ఇది భౌగోళిక తెలంగాణా? లేక ప్రజాస్వామ్య తెలంగాణా? అనే సందేహం చాలా మందికి వచ్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీపీఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, కళాకారులు తమ వంతు కృషి చేశారని అన్నారు. రాష్ట్రం కోసం 1500 మంది విద్యార్థులు బలిదానాలకు పాల్పడ్డారని... ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేసిన ఉద్యమం చారిత్రాత్మకమని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాత... తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుందని... మరోవైపు అన్ని పార్టీలు చేసిన పోరాటాన్ని కేసీఆర్ తన అకౌంట్లో వేసుకున్నారని నారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కమ్యూనిస్టులను కూడా కేసీఆర్ చాలా తెలివిగా పక్కన పెట్టారని విమర్శించారు.
హైదరాబాద్ లో బీజేపీ బలపడటానికి కేసీఆర్ చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని నారాయణ అన్నారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కు దూరం అయ్యారని... చివరకు ఆ పార్టీ కీలక నేత ఈటల రాజేందర్ కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు రాబోతున్నారని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవారికే కేసీఆర్ పెద్దపీట వేశారని విమర్శించారు. తెలంగాణను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.