Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు

Court issues judicial remand for wrestler Sushil Kumar

  • సాగర్ రాణా హత్యకేసులో సుశీల్ అరెస్ట్
  • ముగిసిన 4 రోజుల పోలీస్ కస్టడీ 
  • నేడు కోర్టులో హాజరు పరిచిన ఢిల్లీ పోలీసులు
  • మరో 3 రోజుల కస్టడీ కోరిన వైనం
  • తిరస్కరించిన కోర్టు

యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సాగర్ రాణా మృతి అనంతరం సుశీల్ కుమార్ పరారవగా, అతడిని పంజాబ్ లో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీ పూర్తికావడంతో ఇవాళ అతడిని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ప్రవేశపెట్టారు.

అయితే, పోలీసులు మరో 3 రోజుల కస్టడీ కోరగా, కోర్టు పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది. సుశీల్ కుమార్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది. దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించిన పోలీసులకు కోర్టు నిర్ణయం నిరాశ కలిగించింది. రెండ్రోజుల కిందటే పోలీసులు సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్ ను సస్పెన్షన్ లో ఉంచారు.

రెజ్లింగ్ లో నైపుణ్యం తప్పిస్తే... సుశీల్ కుమార్ ఆది నుంచి వివాదాస్పదుడేనని పలు ఉదంతాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన సాగర్ రాణా హత్య అందుకు పరాకాష్ఠ. భారత్ తరఫున రెజ్లింగ్ లో వరల్డ్ చాంపియన్ గా నిలిచింది సుశీల్ కుమార్ ఒక్కడే. 2010లో అతడు ప్రపంచ విజేతగా నిలిచాడు. కానీ క్రీడేతర విషయాలతో పాతాళానికి పడిపోయాడు.

  • Loading...

More Telugu News