JP Nadda: 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై బీజేపీ నేతల భేటీ!
- వచ్చే ఏడాది కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు
- ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ లో కూడా
- బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు
- ఈ నెల 5, 6న నడ్డా సమావేశాలు
దేశంలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు ఉండే ఉత్తరప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటికి బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 5, 6వ తేదీల్లో సమావేశం కానున్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ అంశంపై ఈ సమావేశంలో అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులను బీజేపీ ఇప్పటికే కోరింది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని నేతలు పలు అంశాలపై మాట్లాడాల్సి ఉంటుందని చెప్పింది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై బీజేపీ తమ నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
కరోనా సమయంలో తమ పార్టీ సేవా హీ సంఘటన్ పేరుతో అందిస్తోన్న సేవా కార్యక్రమాలపై, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.