Etela Rajender: హరీశ్ రావుకు కూడా అవమానం జరిగింది.. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు: ఈటల
- కేసీఆర్ తో నాకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ వచ్చింది
- అది ప్రగతి భవన్ కాదు.. బానిసల నిలయం
- బానిస కంటే అధ్వానమైన మంత్రి పదవి నాకెందుకు?
టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని మాజీ మంత్రి ఈటల తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ హైకమాండ్ కుట్రలను ఛేదిస్తామనే నమ్మకం తమకు ఉందని చెప్పారు.
పార్టీతో తనకే కాకుండా మంత్రి హరీశ్ రావుకు కూడా గ్యాప్ వచ్చిందని అన్నారు. హరీశ్ రావు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ కు కూడా అవమానం జరిగిందని తెలిపారు. ఐదేళ్ల క్రితమే టీఆర్ఎస్ తో, ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందని చెప్పారు.
కేసీఆర్ ఉండే నివాసం ప్రగతి భవన్ కాదని... అదొక బానిసల నిలయమని ఈటల మండిపడ్డారు. బానిస కంటే అధ్వానంగా ఉన్న మంత్రి పదవి తనకెందుకని అన్నారు. కేసీఆర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్క ఐఏఎస్ అధికారి అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను కలిసేందుకు తాను రెండు సార్లు ప్రయత్నించానని... తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని వదులుకోరని చెప్పారు.