Delta Variant: డెల్టా వేరియంట్... భారత్ లో సెకండ్ వేవ్ విజృంభణకు ఇదే కారణమంటున్న కేంద్రం
- కరోనా వైరస్ జన్యు విశ్లేషణ చేపట్టిన కేంద్ర సంస్థలు
- 29 వేల శాంపిళ్ల పరీక్ష
- 1000కి పైగా శాంపిళ్లలో బి.1.617.2 వేరియంట్
- ఇతర వేరియంట్ల కన్నా అధిక వ్యాప్తి
భారత్ లో సెకండ్ వేవ్ ఎంత తీవ్రస్థాయిలో కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జన్యు మార్పులకు గురైన కరోనా వైరస్ మొండిఘటంలా మారి దేశంలో మరణమృదంగం మోగించింది. దీనిపై భారత జీనోమిక్ కన్సార్టియం, ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) జన్యుక్రమ విశ్లేషణ అధ్యయనం చేపట్టాయి. ఈ అధ్యయనం కోసం 29,000 శాంపిళ్ల నుంచి జన్యుక్రమాన్ని పరిశీలించారు. వాటిలో బి.1.617.2 ఒక్కటే వెయ్యికి పైగా శాంపిళ్లలో వెల్లడైంది. బి.1.617.2 రకాన్నే డెల్టా వేరియంట్ అని పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
బి.1.617.2 రకం అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. దేశంలో మిగతా వేరియంట్లతో పోల్చితే ఇదొక్కటే తీవ్రస్థాయిలో వ్యాపిస్తోందని, మిగతా వేరియంట్ల ప్రభావం అంతంతమాత్రమేనని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఒడిశాలో ఇది విజృంభించిందని, అన్ని రాష్ట్రాల్లోనూ దీని ఉనికి వెల్లడైందని వివరించారు. వ్యాక్సినేషన్ కారణంగా ఆల్ఫా వేరియంట్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోగా, డెల్టా వేరియంట్ మాత్రం అధికస్థాయిలో ప్రభావితం చూపిందని తెలిపారు.