Tamil Nadu: జంతువులను కూడా వదలని కరోనా.. తమిళనాడులో సింహం మృతి!
- కరోనాతో తొమ్మిదేళ్ల ఆడ సింహం మృతి
- జూలోని 11 సింహాల్లో తొమ్మిదింటికి కరోనా పాజిటివ్
- నెల రోజులుగా జూ మూతపడి ఉన్నప్పటికీ కరోనా సోకిన వైనం
కరోనా దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కాటుకు ఎన్నో కుటుంబాలు దిక్కతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ వైరస్ ప్రజలనే కాకుండా, జంతువులపై కూడా ప్రభావం చూపుతోంది. తాజాగా తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్కులో 'నీలా' అనే ఆడ సింహం కరోనా బారిన పడి ప్రాణాలు విడిచింది. దీని వయసు తొమ్మిది సంవత్సరాలు.
ఈ జూలో ఉన్న మొత్తం 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. లాక్ డౌన్ కారణంగా నెల రోజులుగా జూ మూతపడి ఉన్నప్పటికీ... వీటికి కరోనా సోకడం గమనార్హం. మరోవైపు జూలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో ఎవరికీ కరోనా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో సింహాలకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.