rain: తెలంగాణకు శరవేగంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు
- కేరళలోకి ఈ నెల 3న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- తెలంగాణలోకి రెండు రోజుల ముందుగానే వచ్చిన రుతుపవనాలు
- కామారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్, సంగారెడ్డిలో వర్షాలు
- హైదరాబాద్ లోనూ నిన్న రాత్రి నుంచి వర్షం
నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఈ నెల 3న ప్రవేశించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే రావడం విశేషం. వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లోకి ప్రవేశించాయని, నేడు మరిన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
కామారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో, రాజన్న సిరిసిల్ల , నిర్మల్, సిద్దిపేటలోనూ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోనూ నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోనూ చాలా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.