COVID19: కరోనా పుట్టింది చైనా గనిలో.. మూలాలు కనిపెట్టిన పూణె శాస్త్రవేత్తలు
- ఇద్దరు దంపతుల పరిశోధన
- ఎప్పుడో మూసేసిన మోజియాంగ్ గనిపై స్టడీ
- క్లీన్ చేయడానికి వెళ్లిన ఆరుగురికి ఇన్ ఫెక్షన్
- అందులో ముగ్గురు మృతి
- ఇప్పుడు కరోనా పేషెంట్లకున్న లక్షణాలే వారికి
- చికిత్స, వాడిన మందులూ అవే
కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ప్రపంచంలోని చాలా దేశాలు వేస్తున్న ప్రశ్న ఇది. వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందని ముందు నుంచీ అమెరికా ఆరోపిస్తోంది. ల్యాబ్ లోనే తయారు చేశారని, లక్షల కోట్ల డాలర్లు జరిమానా కట్టాలని డిమాండ్ చేస్తోంది. అయితే, దంపతులైన ఓ ఇద్దరు శాస్త్రవేత్తలు మాత్రం అది ల్యాబ్ లో పుట్టలేదు.. ఓ గనిలో కరోనా వైరస్ పుట్టిందని చెబుతున్నారు. దాని మూలాలపై ఆరా తీసి ఆధారాలూ చూపించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కరోనా బాధలు చూడలేక పూణెకి చెందిన డాక్టర్ మోనాలీ రహల్కర్, డాక్టర్ రాహుల్ బహులికర్ లు దాని మూలాలు కనుగొనే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇప్పుడు కొవిడ్ కు కారణమైన సార్స్ కొవ్2కు దగ్గరి సంబంధమున్న ఆర్ఏటీజీ13పై వివరాలను వెలికి తీశారు.
అందులో భాగంగానే చాలా ఏళ్ల క్రితమే మూత పడిన దక్షిణ చైనాలోని మోజియాంగ్ రాగి గనికి సంబంధించిన పత్రాలను గుర్తించామని మోనాలీ రహల్కర్ చెప్పారు. ఆ గని మొత్తం గబ్బిలాల పెంటతో నిండిపోయిందన్నారు. కరోనాకు ఆ గనే మూలమని తెలుసుకున్నామన్నారు. 2012లో ఆ గనిని శుభ్రపరిచేందుకు ఆరుగురిని పంపించారని గుర్తించామన్నారు.
గబ్బిలాల పెంట ఎండిపోయిన తర్వాత విరిగిపోయి పొగ రూపంలో గాల్లో కలుస్తుందన్నారు. ఆ గాలిని పీలిస్తే ఇన్ ఫెక్షన్ సోకుతుందని చెప్పారు. పనిచేయడానికి వచ్చిన ఆ ఆరుగురూ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. కరోనా పేషెంట్లలో కనిపించే జ్వరం, దగ్గు, రక్తంలో గడ్డలు వంటి లక్షణాలు ఆ ఆరుగురిలో కనిపించాయన్నారు. ఆ తర్వాత వెంటనే అలసట, న్యుమోనియా వచ్చాయన్నారు.
అంతేగాకుండా ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోనూ అడ్డంకులు (పల్మొనరీ థ్రాంబో ఎంబాలిజం) వంటి సమస్యలూ వచ్చాయన్నారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు చనిపోయారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా పేషెంట్ల రేడియాలజీ, సీటీ స్కాన్ రిపోర్టులు ఆ ఆరుగురికి వచ్చిన వ్యాధితో పోలి ఉన్నాయని గుర్తించామన్నారు.
ఇప్పుడు కరోనా చికిత్సలో వాడుతున్న ఔషధాలు, అప్పుడు ఆ ఆరుగురికి వాడిన మందులూ ఒకటేనని దంపతులు గుర్తించారు. అందుకు కావాల్సిన ఆధారాలను దీ సీకర్ అనే ట్విట్టర్ యూజర్ ద్వారా సంపాదించగలిగారు. ‘చైనా కరోనా డాక్టర్’గా పిలిచే డాక్టర్ ఝోంగ్ నన్షాన్ వారికి చికిత్స చేసిన పద్ధతులకు సంబంధించిన డాక్యుమెంట్లను సంపాదించారు.
ఇప్పుడు కరోనా పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్లు వస్తున్నట్టే.. ఆ ఆరుగురిలోనూ సెకండరీ ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వచ్చాయని నిర్ధారించారు. వాటిని తగ్గించేందుకు యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఔషధాలను వాడినట్టు నన్షాన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుసుకున్నారు. వైరల్ ఇన్ ఫెక్షన్ వల్లే మోజియాంగ్ గనిలోకి వెళ్లిన ఆరుగురు తీవ్రమైన జబ్బున పడ్డారని నన్షాన్ పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ మోజియాంగ్ గనిలో పుట్టిందన్న నిర్ధారణకు వచ్చారు.