Corona Virus: చైనాలో మూడేళ్ల పిల్లలకూ కరోనా టీకా!
- కరోనావాక్ టీకాను రూపొందించిన సైనోవాక్
- 3-7 ఏళ్ల వయసు వారిలోనూ మెరుగైన సామర్థ్యం
- రెండు, మూడు దశల్లో ఆశాజనక ఫలితాలు
- ఇటీవలే డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందిన కరోనావాక్
కనీసం కరోనా ముప్పు ఎక్కువగా ఉండే వర్గాలకైనా టీకా అందించేందుకు అనేక దేశాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికీ మెజారిటీ దేశాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. కానీ, చైనా మాత్రం ఏకంగా మూడేళ్ల వయసు పిల్లలకు కూడా టీకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సినోవాక్ సంస్థ రూపొందించిన కరోనావాక్ టీకాకు అత్యవసర వినియోగానికి చైనా రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం తెలిపాయి. 3-7 ఏళ్ల మధ్య వయసు వారికి ఈ టీకా అందించొచ్చని పేర్కొన్నాయి. అయితే, ఈ వర్గంలోకి వచ్చే అన్ని వయసుల వారికి టీకా ఇవ్వాలా.. వద్దా.. అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
కరోనావాక్ తొలి, రెండో దశ క్లినికల్ పరీక్షల ప్రయోగాలు పూర్తయ్యాయి. పెద్దల్లో ఏవిధంగానైతే ఈ టీకా కరోనాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందో చిన్న పిల్లల్లో సైతం అదే స్థాయిలో కరోనా నుంచి కాపాడే సామర్థ్యాన్ని రోగనిరోధక వ్యవస్థలో కలగజేస్తోందని స్పష్టం చేశారు. జూన్ 1న కరోనావాక్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. చైనా రూపొందించిన మరో వ్యాక్సిన్ సైరోఫార్మ్కు ఇప్పటికే డబ్ల్యూహెచ్వో అనుమతి లభించింది.