Uttar Pradesh: మోదీ, యోగి మధ్య విభేదాల వార్తలపై రాధామోహన్ సింగ్ స్పష్టీకరణ
- విభేదాల వార్తలు ఊహాగానాలు మాత్రమే
- మోదీ ఆశయాలను యోగి అమలు చేస్తున్నారు
- నాయకత్వ మార్పు ఉండబోదు
- గవర్నర్‌తో సమావేశం వ్యక్తిగతం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, యూపీ ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని కొట్టిపడేశారు. యోగి, మోదీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. మోదీ ఆశయాలను యోగి నిబద్ధతతో అమలు చేస్తున్నారని కితాబునిచ్చారు. అలాగే, యూపీలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను కూడా రాధామోహన్ సింగ్ కొట్టిపడేశారు.
పార్టీ, ప్రభుత్వం రెండూ కలిసి చాలా బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలను కూడా ఆయన కొట్టిపడేశారు. విస్తరణ ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, మంత్రివర్గంలో ఉన్న ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి యోగి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం అందరి దృష్టి జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలపైనే ఉందని తెలిపారు.
గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో నిన్న సమావేశం కావడంపైనా రాధామోహన్ సింగ్ వివరణ ఇచ్చారు. తాను యూపీ ఇన్చార్జ్ అయిన తర్వాత ఆమెను కలవలేదని, అందుకనే ఇప్పుడు కలిసినట్టు చెప్పారు. దీనికి తోడు ఆమెతో తనకు పాత పరిచయం కూడా ఉందని, ఇది వ్యక్తిగత సమావేశం మాత్రమేనని అన్నారు. అలాగే, స్పీకర్ నారాయణ్ దీక్షిత్‌తో 40 నిమిషాలపాటు సమావేశమైనా రాజకీయాల గురించి మాట్లాడుకోలేదని రాధామోహన్ సింగ్ వివరించారు.