Tata Safari: నాలుగు ప్రశ్నలకు జవాబు చెబితే టాటా సఫారీ మీదేనంటారు... వలలో పడితే ఇక అంతే సంగతులు!

Beware of online fraud in the name of Win Tata Safari

  • వాట్సాప్ గ్రూపుల్లో మోసపూరిత ప్రకటనలు
  • టాటా మోటార్స్ పేరిట తప్పుడు ప్రకటన
  • కంపెనీ ఉచితంగా కారు ఇస్తోందంటూ ప్రచారం
  • వ్యక్తిగత సమాచారం రాబట్టే వ్యూహం

సైబర్ మోసగాళ్ల తెలివితేటలు అన్నీఇన్నీ కావు. పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేయడానికి ఎన్నో ప్రణాళికలు రచిస్తుంటారు. ప్రజలను ఉచ్చులోకి లాగి తమ పబ్బం గడుపుకుంటారు. అందుకోసం... ఆఫర్లు, బంపర్ ప్రైజులు పేరిట ఎర వేస్తారు. ఎవరైనా తమ గాలానికి చిక్కుకుంటే వారిని నిలువుదోపిడీ చేస్తారు. ఇటీవల కాలంలో రకరకాలుగా మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు తాజాగా టాటా సఫారీ కారు మీదేనంటూ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు.

టాటా మోటార్స్ సంస్థ 30 మిలియన్ల వాహనాలు అమ్మిన సందర్భంగా ఓ సఫారీ వాహనాన్ని ఫ్రీగా అందిస్తోందని వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే టాటా మోటార్స్ వెబ్ సైట్ కి కాకుండా, మరో పేజీకి వెళుతోంది. అక్కడ 4 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలంటూ కోరడం, ఆపై వ్యక్తిగత సమాచారం రాబడుతున్న విషయం వెల్లడైంది. ఆ పేజీలో పలువురు తమకు కారు బహుమానంగా వచ్చిందంటూ ఇతరులను నమ్మించేలా కామెంట్లు పెట్టడం కూడా చూడొచ్చు. అయితే అవన్నీ ఫేక్ ఐడీలేనట.

ఇలాంటి ప్రకటనల పట్ల మోసపోవద్దని, వీటికి ఆకర్షితులైతే వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లకు అందించినట్టేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు, టాటా మోటార్స్ ఇలాంటి ఉచిత వాహనాల ప్రకటనే చేయలేదని వివరించారు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వాట్పాప్ గ్రూపుల్లో కనిపిస్తున్న సైబర్ మోసగాళ్ల ప్రకటన ఇదిగో...

  • Loading...

More Telugu News