KTR: ట్విట్టర్ చాట్ లో వివాదం... కేటీఆర్‌ను దూషించిన బీజేపీ నేత ఖేమ్ చంద్ శర్మ
- ట్విట్టర్‌లో కేటీఆర్ ‘లెట్స్ టాక్ వ్యాక్సినేషన్’ పేరుతో చిట్‌చాట్
- వ్యాక్సినేషన్ విషయంలో వెనుకబడి ఉన్నామన్న కేటీఆర్
- అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఖేమ్‌చంద్ శర్మ అనుచిత వ్యాఖ్యలు
టీకాల విషయంలో కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ర శర్మ ఫైరయ్యారు. సహనం కోల్పోయి మంత్రిని ‘ఇడియట్’ అంటూ దూషించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్‌లో ‘లెట్స్ టాక్ వ్యాక్సినేషన్’ హ్యాష్‌టాగ్‌తో చిట్‌చాట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర విధానాలను తప్పుబట్టారు. భారత్ వ్యాక్సిన్ల హబ్‌గా ఉన్నప్పుడు డిమాండుకు, సరఫరాకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. మిగతా దేశాలన్నీ గతేడాది మొదట్లోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, కేంద్రం మాత్రం ఇప్పుడు కళ్లు తెరిచిందని విమర్శించారు.
కేటీఆర్ విమర్శలపై ఖేమ్‌చంద్ శర్మ తీవ్రంగా స్పందించారు. ‘యూ ఇడియట్’ అంటూ విరుచుకుపడ్డారు. టీకాల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకాల విషయంలో మనమే ముందున్నామని, ఇప్పటి వరకు 17.5 కోట్ల మందికి తొలి డోసు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తంగా 22.37 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు.
ఖేమ్ చంద్ వ్యాఖ్యలపై కేటీఆర్ సౌమ్యంగా స్పందించారు. తాను కూడా మీలాగే మాట్లాడగలను కానీ, అది తమ సంస్కృతి కాదని బదులిచ్చారు. ఇజ్రాయెల్‌లో 60 శాతం మందికి, అమెరికాలో 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. దీనిని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగానే ఉంటాయని చెప్పారు.