West Bengal: పశ్చిమ బెంగాల్లో పిడుగులతో కూడిన వర్షం.. 20 మంది బలి
- ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం
- పలు జిల్లాలో బీభత్సం సృష్టించిన వానలు
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా విచారం
- బాధిత కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం
పశ్చిమ బెంగాల్లో నిన్న భీకరంగా కురిసిన వర్షానికి 20 మంది బలయ్యారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు తీవ్రమైన గాలులతో కూడిన వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వానలకు 20 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.
ముర్షీదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున, తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఇద్దరు పిడుగులు పడి చనిపోయినట్టు పేర్కొన్నారు. వర్షాలకు 20 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.