Sharmila: ఎన్నికలు ఎంత వేగవంతంగా జరిపించారో అంతే వేగంగా ఈ పనీ చేయాలి: షర్మిల
- ఇప్పటికైనా మోదీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామనడం సంతోషం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరును మార్చుకోవాలి
- ఒకరిమీద ఒకరు బట్టకాల్చి మీదేసుకొనే ప్రయత్నాలు మానాలి
- 3వ వేవ్ రాకముందే అందరికీ వ్యాక్సిన్ వేయాలి
వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్ షర్మిల స్పందించారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షర్మిల ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని మోదీ ప్రకటించారు. వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ నిర్ణయాన్ని ఈ నెల 21వ తేదీ నుంచే అమలు చేస్తామన్నారు. ఈ విషయాలను షర్మిల ప్రస్తావించారు.
'ఇప్పటికైనా మోదీ గారు అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామనడం సంతోషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు బట్టకాల్చి మీదేసుకొనే ప్రయత్నాలు మానేసి 3వ వేవ్ రాకముందే అందరికి వ్యాక్సిన్ ను త్వరితగతిన, ఎలక్షన్ లు ఎంత వేగవంతంగా జరిపించారో అంతే వేగంగా వ్యాక్సిన్ అందించాలని కోరుతున్నాం' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.