Uttar Pradesh: ఆగ్రా ఆసుపత్రి నిర్వాకం: ఆక్సిజన్​ మాక్​ డ్రిల్​.. 22 మంది మృతి!

22 died in UP Paras Hospital Oxygen Mock Drill

  • నగరంలోని శ్రీ పరాస్ ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన 
  • 5 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా బంద్
  • ఏప్రిల్ 26న ఘటన.. వీడియో వైరల్
  • నీలి రంగులోకి మారిన 22 మంది
  • విచారణకు ఆదేశించిన జిల్లా యంత్రాంగం

ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం 22 మంది ప్రాణాలను బలి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రి యాజమాన్యం ఆక్సిజన్ మాక్ డ్రిల్ పేరిట వారి ప్రాణాలను తీసినట్టు సమాచారం. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాను ఐదు నిమిషాల పాటు ఆపేశామన్న ఆసుపత్రి యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ మాటలు స్పష్టంగా వినిపించాయి.

‘‘మోదీనగర్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పేషెంట్లను తీసుకువెళ్లాల్సిందిగా వారి కుటుంబ సభ్యులకు చెబుతున్నా వారు పట్టించుకోలేదు. దీంతో నేను ‘మాక్ డ్రిల్’ లాంటి ఓ ప్రయోగం చేయాలనుకున్నా. ఏప్రిల్ 26న ఉదయం 7 గంటలకు ఆరోగ్యం విషమించిన 22 మంది రోగులకు ఆక్సిజన్ ను ఐదు నిమిషాల పాటు ఆపేశాం. వాళ్ల శరీరాలు నీలి రంగులోకి మారడం మొదలైంది. ఇక వాళ్లు బతకడం కష్టమని చెప్పాం. తర్వాత మిగతా 74 మంది పేషెంట్ల కుటుంబ సభ్యులకు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలని చెప్పాం’’ అని అరింజయ్ చెప్పినట్టు వీడియోలో రికార్డయింది.

అయితే, వీడియోలో ఉన్నది తానే అయినా తన వ్యాఖ్యలను వక్రీకరించారని అరింజయ్ చెప్పారు. పరిస్థితి విషమించిన వారిని గుర్తించి మెరుగైన చికిత్స ఇచ్చేందుకే మాక్ డ్రిల్ చేశామని ఆయన వివరించారు. ఏప్రిల్ 26న నలుగురు, మర్నాడు మరో ముగ్గురు కరోనా పేషెంట్లు చనిపోయారన్నారు. అయితే, 26న 22 మంది చనిపోయారా? అన్న ప్రశ్నకు మాత్రం తనకు కచ్చితమైన నంబర్ తెలియదని దాటవేశారు.

మరోపక్క, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, ఓ కమిటీ వేశామని ఆగ్రా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ పాండే తెలిపారు. ఆసుపత్రి ఐసీయూ చాలా పెద్దది కావడంతో వేరే కారణాలతోనూ చనిపోయిన వారు ఉండి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్. సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News