Telangana: రేవంత్ రెడ్డి ట్వీట్ పై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
- చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే వస్తాయని కామెంట్
- వాటిపై స్పందించబోనన్న మంత్రి
- జగదీశ్ కుమారుడి బర్త్ డే వేడుకలపై రేవంత్ వ్యంగ్య ట్వీట్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనను ఉద్దేశిస్తూ రేవంత్ చేసిన వ్యంగ్య ట్వీట్ పై మండిపడ్డారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు మాట్లాడిన విషయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు.
ఇప్పటికే చాలా జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించామని, త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స అందుతోందన్నారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
జగదీశ్ రెడ్డి కుమారుడి పుట్టిన రోజు వేడుకలను హంపిలో జరిపినట్టు, ఆ వేడుకలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇప్పటికే ఈటలపై వేటు పడడంతో.. తర్వాతి వేటు పడేది జగదీశేనా? అన్న కోణంలో వార్తను ప్రచురించింది.
ఆ కథనాలను ట్వీట్ చేసిన రేవంత్.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా? అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.