Mumbai: ముంబైలో కూలిన 4 అంతస్తుల భవనం.. 9 మంది సజీవ సమాధి

4storey building in Malvani collapses 9 dead

  • గత రాత్రి 11.30 గంటల సమయంలో ఘటన
  • శిథిలాల నుంచి 15 మందిని రక్షించిన సహాయక సిబ్బంది
  • సమీప భవనాలు కూడా ప్రమాదంలోనే
  • ఖాళీ చేయించిన అధికారులు
  • మరో నాలుగు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు

ముంబైలోని మల్వాని ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి 11.10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చిన్నారులు సహా పలువురు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికులతో కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. కూలిన భవనం సమీపంలోని ఇతర బిల్డింగులు కూడా ప్రమాదంలో ఉండడంతో అందులోని వారిని ఖాళీ చేయించినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలినట్టు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు.

నగరంలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది. రోడ్లు, రైలు ట్రాకులపైకి నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై సహా పలు జిల్లాలలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటించింది.

  • Loading...

More Telugu News