Bihar: హైకోర్టు ఆదేశాలతో కరోనా మృతుల సంఖ్యను సవరించిన బీహార్
- బీహార్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్యను తగ్గించి చూపిస్తున్నారన్న వార్తలు
- పాట్నా హైకోర్టు సరైన లెక్కలను చూపాలని ఆదేశం
- ఇంతకు ముందు 5,424 మంది మృతి చెందారన్న బీహార్ సర్కారు
- ఇప్పుడు మృతుల సంఖ్యను 9,375కి పెంచిన వైనం
బీహార్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్యను తగ్గించి చూపిస్తున్నారన్న వార్తలు రావడంతో పాట్నా హైకోర్టు సరైన లెక్కలను చూపాలని ఆదేశించింది. ఏప్రిల్-మే నెలల్లో కరోనా రెండో దశ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారో సరిగ్గా పరిశీలించాలని పాట్నా హైకోర్టు పేర్కొంది.
దీంతో సవరించిన గణాంకాలను బీహార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంతకు ముందు చూపించిన కరోనా మృతుల సంఖ్య కంటే ఇప్పుడు 72.8 శాతం అధికంగా చూపడం గమనార్హం. తమ రాష్ట్రంలో 5,424 మంది మాత్రమ కరోనాతో మృతి చెందారని మొదట్లో చెప్పిన బీహార్, ఇప్పుడు మృతుల సంఖ్యను 9,375కి పెంచింది. అంటే మృతుల సంఖ్యను ఇప్పుడు 3,951 పెంచి చూపింది.
పాట్నా హైకోర్టు ఆదేశాలతో దాదాపు 20 రోజుల పాటు బీహార్ ప్రభుత్వ అధికారులు రికార్డులను తెప్పించుకుని గణాంకాలను సరిచేసి విడుదల చేశారు. నాలుగు జిల్లాల్లో కరోనా మృతుల సంఖ్యను దాదాపు 200 శాతం చొప్పున పెంచడం గమనార్హం. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు బీహార్‌లో కొవిడ్‌తో 1,600 మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అయితే, గత రెండు నెలల్లోనే ఆ రాష్ట్రంలో మరో 7,775 మంది మృతి చెందడం గమనార్హం. అంటే మరణాల సంఖ్య ఏకంగా రెండు నెల్లలో ఐదు రెట్లు పెరిగింది. రాజధాని పాట్నాలో 2,303 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అయితే అక్కడి మూడు శ్మశాన వాటికల్లోని అధికారిక రికార్డుల ప్రకారం 3,243 మంది కొవిడ్ మృతుల అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది.