Polavaram Project: పోలవరం ప్రాజెక్టు వద్ద కీలక ఘట్టం... స్పిల్ వే ద్వారా నీటి విడుదల
- నిర్మాణం పూర్తి చేసుకున్న అప్పర్ కాఫర్ డ్యాం
- అప్రోచ్ చానల్ ద్వారా నీటి విడుదల
- గోదావరి డెల్టాకు చేరనున్న నీరు
- వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టులో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్ వే నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రధాన ప్రవాహం నుంచి నీటిని స్పిల్ వేకు మళ్లించారు. ఈ సందర్భంగా వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు.
అటు, పోలవరం అప్రోచ్ చానల్ వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టి నీటిని స్పిల్ వేకు విడుదల చేశారు.
కాగా, స్పిల్ వేకు విడుదలైన గోదావరి నీరు రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజికి చేరుతుంది. బ్యారేజి నుంచి గోదావరి డెల్టా కాలువల ద్వారా పంట పొలాలను సస్యశ్యామలం చేయనుంది. ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే, నీటిని దిగువకు పంపించగలగడం విశేషం అని చెప్పాలి. గోదావరి వరద నీటిని అడ్డుకునే ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికావడంతో నీటిని స్పిల్ వేకు మళ్లించడానికి సాధ్యమైంది.