mRNA VACCINE: రెండు డోసుల మధ్య విరామం పెంపుతో కొత్త వేరియంట్లు సోకే ముప్పు: ఫౌచీ

Extending vaccine intervals may increase variants infection capacity
  • ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను షెడ్యూల్‌ ప్రకారం ఇవ్వాలని సూచన
  • లేదంటే కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిక
  • డెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై ఫౌచీ ఆందోళన
  • డెల్టాకు వ్యాక్సిన్‌తోనే చెక్‌ పెట్టాలని హితవు
కరోనా టీకా డోసుల మధ్య విరామాన్ని పెంచడం వల్ల కొత్త వేరియంట్లు సోకే ముప్పు పెరుగుతుందని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు అయిన ఫైజర్‌కు మూడు వారాలు, మోడెర్నాకు నాలుగు వారాల వ్యవధి ఉందన్నారు. దీన్ని మరింత పెంచడం వల్ల కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం పెరుగుతుందన్నారు.

ఈ నేపథ్యంలో షెడ్యూల్‌కు అనుగుణంగా వ్యాక్సిన్లు ఇవ్వడం కీలకమన్నారు. అయితే, వ్యాక్సిన్ల కొరత ఉన్న సమయంలో వ్యవధి పెంపు కొన్నిసార్లు తప్పనిసరి కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రముఖ జాతీయ ఛానెల్‌ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

భారత్‌లో కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించినప్పటికీ వైరస్‌పై పోరాడే సామర్థ్యం విషయంలో పెద్దగా తేడా ఏమీ ఉండదని నిపుణులు సూచించడంతోనే ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్న డెల్టా వేరియంట్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఫౌచీ సూచించారు.
mRNA VACCINE
Corona Virus
corona vaccine
Antony Fauci

More Telugu News