Raghu Rama Krishna Raju: నాపై అనర్హత వేటు వేయలేరు.. నేను ఏ పార్టీతోనూ కలవలేదు: రఘురామకృష్ణరాజు
- సంక్షేమ ఫలితాల అమలు లోపాలను మాత్రమే ప్రస్తావించా
- వైసీపీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదు
- కొందరు తప్పుడు వ్యక్తుల నుంచి వైసీపీని కాపాడుకునే ప్రయత్నం చేశా
- నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి
వైసీపీ ఎంపీగా ఎన్నికైన రఘురామ కృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రఘురామ స్పందిస్తూ.. తాను ఏపీ సర్కారు సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని, తనపై అనర్హత వేటు వేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
అంతేగాక, తాను ఏ పార్టీతోనూ కలవలేదని చెప్పారు. అలాగే, వైసీపీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. కొందరు తప్పుడు వ్యక్తుల నుంచి తాను వైసీపీని కాపాడుకునే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని, తనపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తానని చెప్పారు.
తనపై ఈ నెల 10న ఫిర్యాదు చేశారని, అయితే, 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ కలిసిన అనంతరమే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారని ఆయన చెప్పారు. అనర్హత వేటుపై ఇప్పటికే తనపై దాదాపు ఐదు సార్లు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు.