Aisha Sultana: అయీషా సుల్తానాపై దేశద్రోహం కేసు పర్యవసానం: పార్టీకి లక్షద్వీప్ బీజేపీ నేతల రాజీనామా
- అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు
- సొంత పార్టీ నేతలే ప్రఫుల్ ఖోడాపై నిరసించారని కామెంట్
- పార్టీ అధ్యక్షుడికి లేఖ పంపిన పలువురు నేతలు
వర్థమాన సినీ దర్శకురాలు అయీషా సుల్తానాపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ లక్షద్వీప్ నేతలు ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్ ముల్లిపుళ నేతృత్వంలోని పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ కు వ్యతిరేకంగా ఓ టీవీ డిబేట్ లో మాట్లాడిన అయీషా సుల్తానా.. ఆయన నియామకంతో కేంద్ర ప్రభుత్వమే లక్షద్వీప్ ప్రజలపై జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ ఆరోపించారు. దీనిపై బీజేపీ లక్షద్వీప్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆమెపై తప్పుడు కేసులు పెట్టారంటూ పార్టీ నేతలు అబ్దుల్ ఖాదీర్ కు లేఖ రాశారు. తమ రాజీనామాలను పంపించారు. ప్రఫుల్ ఖోడా అప్రజాస్వామిక విధానాలపై బీజేపీ నేతలే పోరాడుతున్న సమయంలో.. అయీషా సుల్తానా టీవీ చర్చాగోష్ఠిలో విమర్శలు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆమెపై తప్పుడు కేసులు పెట్టారని, ఆమెను, ఆమె కుటుంబ భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రఫుల్ పటేల్ అప్రజాస్వామిక చర్యల వల్ల ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, జిల్లా కలెక్టర్ తీసుకున్న తప్పుడు చర్యలను బీజేపీ నేతలూ ప్రశ్నించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కాగా, ఇప్పటికే గత మేలో 8 మంది బీజేపీ నేతలు పార్టీని వీడారు.