Black Fungus: మనిషి మెదడులో క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్ ఫంగస్ తొలగింపు
- బీహార్‌లోని పాట్నాలో ఘటన
- మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి తొలగింపు
- ముక్కు ద్వారా మెదడులోకి చేరిందన్న వైద్యులు
కరోనా నుంచి కోలుకుంటున్న వారు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న కేసులు దేశంలో ఇటీవల బాగా పెరిగాయి. కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుండడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని ఇప్పటికే నిర్ధారించారు. ఇది కళ్లపై విపరీత ప్రభావాన్ని చూపుతుంది.
తాజాగా బీహార్ రాజధాని పాట్నా ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల అనిల్ కుమార్ కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డాడు. అతడిని పరీక్షించిన ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) వైద్యులు ఆశ్చర్యపోయారు. అతడి మెదడులో ఏకంగా క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్ ఫంగస్ వారిని షాక్‌కు గురిచేసింది.
డాక్టర్ బ్రజేశ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం మూడు గంటలకుపైగా శస్త్రచికిత్స నిర్వహించి అతడి మెదడులో పేరుకుపోయిన బ్లాక్ ఫంగస్‌ను విజయవంతంగా తొలగించింది. ఫంగస్ ముక్కు నుంచి అతడి మెదడుకు చేరి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే, అతడి కళ్లకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు.