Viswanathan Anand: చెస్ లో ఆనంద్ ను ఓడించిన జెరోధా స్టార్టప్ అధినేత... ఇది అనైతిక విజయం అని వెల్లడించిన చదరంగ సమాఖ్య
- నిధుల సేకరణకు అక్షయపాత్ర ఫౌండేషన్ చారిటీ మ్యాచ్
- విశ్వనాథన్ ఆనంద్ తో తలపడిన నిఖిల్ కామత్
- కంప్యూటర్ సాయంతో గెలిచిన కామత్
- ఇది నిబంధనలకు విరుద్ధమన్న చదరంగ సమాఖ్య
- క్షమాపణలు తెలిపిన కామత్
భారతదేశం గర్వించదగ్గ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్ రంగంలో ప్రకంపనలు సృష్టించి, రష్యా అధిపత్యాన్ని సవాల్ చేశాడు. కాస్పరోవ్, కార్పొవ్, క్రామ్నిక్ వంటి ఉద్ధండులతో తలపడి ఐదు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలవడమంటే మాటలు కాదు. కానీ విషీ అది సాధ్యమేనని నిరూపించాడు. అంతటి గొప్ప చెస్ క్రీడాకారుడు ఓ చారిటీ మ్యాచ్ లో ఓడిపోయాడంటే ఎవరైనా నమ్మగలరా? కానీ అది జరిగింది. ఆ ఓటమి ఎలా సంభవించిందన్నది ఆసక్తికరం.
నిధుల సేకరణ నిమిత్తం అక్షయపాత్ర ఫౌండేషన్ చెస్ చారిటీ మ్యాచ్ ఏర్పాటు చేసింది. ఈ పోటీలో జెరోధా స్టార్టప్ అధినేత నిఖిల్ కామత్... విశ్వనాథన్ ఆనంద్ పై గెలిచాడు. ఈ పోటీ ఆన్ లైన్ విధానంలో జరగ్గా... ఏ క్రీడాకారుడు కూడా కంప్యూటర్ సాయం తీసుకోకుండా ఆడాల్సి ఉంటుంది. అయితే జెరోధా అధినేత నిఖిల్ కామత్... ఆనంద్ తో గేమ్ లో ఎలాంటి ఎత్తులు వేయాలో కంప్యూటర్ లో చూసి, వాటినే అనుసరించి ఆనంద్ ను ఓడించాడు.
ఈ విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది అనైతికం అని, మ్యాచ్ నిబంధనలకు విరుద్ధమని ఆలిండియా చెస్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) కార్యదర్శి భరత్ చౌహాన్ విమర్శించారు. ఓ చారిటీ గేమ్ లో ఇలాంటి అనైతిక ఎత్తుగడలకు పాల్పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కాగా, తన విజయంపై వస్తున్న విమర్శల పట్ల నిఖిల్ కామత్ స్పందిస్తూ క్షమాపణలు తెలియజేశారు. "నేను నిజంగానే విశ్వనాథన్ ఆనంద్ గారిపై గెలిచానని అనుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే నేను ఉసేన్ బోల్ట్ ను 100 మీటర్ల పరుగులో ఓడించినట్టుగా ఉంది. నేను ఈ గేమ్ లో గెలిచేందుకు కొందరు నిపుణుల సలహాలు, కంప్యూటర్ విశ్లేషణను అనుసరించాను" అని వివరించారు.