Telangana: అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
- ఝార్ఖండ్ వద్ద తీరం దాటిన అల్పపీడనం
- తెలంగాణ వైపు తిరిగి ఉందన్న అధికారులు
- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నేడు, రేపు కూడా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న రాత్రి తీరం దాటి ఝార్ఖండ్ పైకి చేరుకుంది.
ఇదిప్పుడు తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతోపాటు ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.