Margani Bharat: రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలి: మార్గాని భరత్
- రఘురామపై గుర్రుగా ఉన్న వైసీపీ అధినాయకత్వం
- లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు
- రఘురామపై అనర్హత వేటు తథ్యమన్న మార్గాని భరత్
- లోక్ సభ స్పీకర్ రిమైండర్ నోటీసు ఇచ్చామని వెల్లడి
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వర్తింపజేస్తూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళితే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు ఖాయమని మార్గాని భరత్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే రిమైండర్ నోటీసు ఇచ్చామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజుపై ఆర్టికల్-10 ప్రకారం తప్పనిసరిగా వేటు పడుతుందని అన్నారు.
రఘురామకృష్ణరాజు లోక్ సభ స్పీకర్ ను కలిసినంత మాత్రాన ఆయనను డిస్ క్వాలిఫై చేయడం ఆగదని వివరించారు. సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.