Srirama Janmabhumi Theertha Kshetra Trust: భూమి కొనుగోలు వివాదంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వివరణ
- అయోధ్యలో రామమందిర నిర్మాణం
- వివాదాస్పదంగా మారిన భూమి కొనుగోలు
- తీవ్ర ఆరోపణలు చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత
- అవినీతి జరిగిందన్న తేజ్ నారాయణ్ పాండే
- పారదర్శకంగా వ్యవహరించినట్టు ట్రస్టు వివరణ
అయోధ్య రామమందిరం నిర్మాణం నేపథ్యంలో ఓ భూమి కొనుగోలు అంశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అవినీతికి పాల్పడిందని సమాజ్ వాదీ పార్టీ నేత తేజ్ నారాయణ్ పాండే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ భూమిని సుల్తాన్ అన్సారీ, రవిమోహన్ తివారీ అనే వ్యక్తులు రూ. 2 కోట్లకు కొనుగోలు చేయగా, కేవలం 10 నిమిషాల తర్వాత అదే భూమిని ట్రస్టు రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని వెల్లడించారు.
ఆర్టీజీఎస్ ద్వారా ట్రస్టు నుంచి తివారీ, అన్సారీల ఖాతాలకు రూ.17 కోట్లు వెళ్లాయని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని పాండే డిమాండ్ చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఇదే రీతిలో ట్రస్టుపై విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వివరణాత్మకంగా స్పందించింది. అయోధ్యలో మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే దీన్ని కొన్నామని వెల్లడించింది. 2011 నుంచి ఈ భూమి కొనుగోలుకు పలువురు వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగాయని, అయితే అవి కార్యరూపం దాల్చలేదని వివరించింది. గత పదేళ్ల కాలంలో ఈ భూమి అగ్రిమెంట్లలో 9 మంది ఉన్నారని, వారందరూ అనేక చర్చల పిమ్మట తమ పాత అగ్రిమెంట్లను పరిష్కరించుకునేందుకు అంగీకరించారని ట్రస్టు పేర్కొంది.
పూర్వ ఒప్పందాలు పరిష్కారం అయిన వెంటనే భూమిని అంతిమ యజమానుల నుంచి కొనుగోలు చేశామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని వెల్లడించింది. అయితే, భూమి కొనుగోలు నేపథ్యంలో లావాదేవీలు బ్యాంకింగ్ మార్గాల ద్వారానే జరపాలనేది ట్రస్ట్ విధివిధానాల్లో ముఖ్యమైనదని, చెక్కులు, నగదు వంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఆ ప్రకారమే భూమి కొనుగోలుకు బ్యాంకింగ్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసినట్టు వివరించింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగినట్టు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి.