Corona Virus: టీకా తీసుకున్న వారిలో మరణించింది ఒక్కరే!: స్పష్టం చేసిన కేంద్రం
- వ్యాక్సిన్ తీసుకున్న 31 మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు
- అనాఫిలాక్సిస్ రియాక్షన్‌తో 68 ఏళ్ల వృద్ధుడి మృతి
- మిలియన్ వ్యాక్సిన్లకు 2.7గా మరణాల రేటు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు మరణించినది ఒక్కరేనని కేంద్రం స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 31 మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, వారిలో టీకా తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
మొత్తం 31 కేసులలో మూడు కేసులు అనాఫిలాక్సిస్ కు సంబంధించినవి. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఒకరు మాత్రం మరణించారు. మరణించిన వ్యక్తి మార్చి 8న తొలి డోసు తీసుకున్నట్టు నివేదిక పేర్కొంది. అదే నెల 31న అనాఫిలాక్సిస్ రియాక్షన్ కారణంగా మరణించినట్టు కమిటీ సలహాదారు ఎన్‌కే అరోరా తెలిపారు.
18 కేసులకు వ్యాక్సిన్లతో సంబంధం లేదని గుర్తించారు. వ్యాక్సిన్లకు సంబంధించి రెండు కేసులు మాత్రం ఉన్నాయని, ఏడు కేసుల్లో మరణాలకు వ్యాక్సిన్లే కారణమని నిర్ధారించడానికి కచ్చితమైన ఆధారాలు లేవని నివేదిక పేర్కొంది. రెండు కేసులకు సంబంధించి సరైన సమాధానం లేదని వివరించింది.
టీకా తీసుకోవడం వల్ల ప్రయోజనాలే ఎక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మిలియన్ వ్యాక్సిన్లకు మరణాల రేటు 2.7గా, ఆసుపత్రుల్లో చేరే వారి రేటు 4.8గా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.