TDP: ఉంగుటూరు సర్పంచ్ భర్తపై దాడి నిందితులను అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమన్న అచ్చెన్నాయుడు
- నిందితుడు రాయపాటి శివను అరెస్ట్ చేయాలి
- సోమశేఖర్‌పై రెండు నెలల్లో ఆరుసార్లు దాడులు: ఆలపాటి
- పార్టీలోకి రాలేదన్న అక్కసుతోనే పల్లాపై కక్ష: బుద్ధా వెంకన్న
గుంటూరు జిల్లా ఉంగుటూరు సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై జరిగిన దాడిని టీడీపీ ఖండించింది. సర్పంచ్‌గా గెలిచి అభివృద్ధి పనులు చేస్తుంటే దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు రాయపాటి శివను అరెస్ట్ చేసి రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
సోమశేఖర్‌పై రెండు నెలల్లో ఆరుసార్లు దాడులు జరిగాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలోనే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాను అభివృద్ధి చేయకపోవడమే కాకుండా చేస్తున్నవారిపై దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.
రమ్మని ఆహ్వానించినా పార్టీలో చేరలేదన్న అక్కసుతోనే టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కక్ష సాధిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. విశాఖలో పట్టులేని వైసీపీ నేతలు బలమైన బీసీ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.